పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

496

ద్విపద భారతము


చారులవలనను జగములవార్త
లారయ విందువే యవనీశచంద్ర?
సంధిల్లువార్త లెచ్చట వినకున్న
నంధకారముగప్పు నవనిలోపలను;
దారసంగ్రహమును ధనసంగ్రహంబు
వారణ రథ హయవ్రాత సంగ్రహముఁ
జేయుచు, సర్వంబుఁ జిత్తంబునందుఁ
బాయక యెఱుఁగంగవలయుఁ దత్ఫలము;
చాలంగఁ దృణ కాష్ఠ జలసమృద్ధియును
శ్రీలు ధాన్యంబులుఁజింతితార్థములుఁ
గలిగి దట్టములైన కడిఁదిదుర్గములఁ
జెలువుగా సవరణసేయించి తయ్య?
అరులగెల్చునుపాయ మాచరింపుదువె?
అరయ నాస్తిక్యంబు, ననృతభాషణము,
నప్రసాదంబును, నాలస్యమును, మ
హాప్రమత్తతయు, [1]ననర్థకచింత,
చింతింపఁ గ్రోధంబు, [2]శీఘ్రచింతయును,
అంతంబుగాననియట్టిసూత్రతయు,
నెఱుకగల్గినవారి నెఱుఁగకుండుటయుఁ,
[3]దెఱఁగొప్ప నర్థంబు ధృతిఁ దాఁపకునికి,
మునుపు నిశ్చితకార్యములు సేయమియును,
ఘనమంత్రములు సురక్షణమొనర్పమియుఁ,
గ్రియ శుభంబులు ప్రయోగింపకయునికి,
భయ విషయాప్తినాఁబరగు పదునాల్గు
రాజదోషంబులు రమణవర్జింతె?
రాజితంబుగ." నన్న రాజు ధర్మజుఁడు

  1. 'అనర్థజ్ఞులతోడి చింతనము'
  2. 'దీర్ఘ చింత'
  3. 'అర్థంబులయం దనర్థకచింత' అని నన్నయ. సభా.