పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

495


వనములు రక్షింతె వసుధాధినాథ?
పెనుపొంద దున్నెడు పేదకాపులకు
లాలించి విత్తులెల్లను జాలనొసగి,
[1]భావంబుదప్పినఁ బన్నులు గొనక
వలనుగా మెలపుదా? వాణిజ్యతతులఁ
గొలఁదివృద్ధికినిచ్చి కూర్మిమన్పుదువె?
పంగుల మూఁగల బాహుహీనులను
వెంగలిమతులను వికలదేహులను
అరసిరక్షింతువె? యాజిలోఁ గాతె
శరణన్న నెంతటిశాత్రవునైనఁ?
గృతమెఱింగినవానిఁ గృపఁబ్రోతువయ్య?
కృతకృత్యుఁడని నిన్ను గ్రియఁ బ్రస్తుతింప;
ధనము నాలుగుపాళ్లు దప్పక చేసి
వెనుకొని యొకపాలు వెచ్చంబుసేతె?
ఆయుధశాలల నశ్వశాలలను
దోయదవర్ణ సింధుర శాలలందు
బండారమిండ్లను బరమవిశ్వాస్యు
లుండంగ నియమింతె యుర్వీతలేశ?
పేదల సాదులఁ బెద్దల హితుల
మేదినీసురులను మిత్రబాంధవుల
నరసి రక్షింతువె యవనీశతిలక?
పరమంత్ర భేదనోపాయ మంత్రులును
మూలబలంబును మూర్థాభిషిక్తు
లోలిఁగొల్వఁగను గొల్వుండుదే నీవు?
అనవరతంబు బాహ్యాభ్యంతరములు
గనుఁగొని మెలఁగుదే గౌరవంబునను?

  1. ఈపదమును వివిధార్థములలోవాడును; ఆధారమూహ్యము.