పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

490

ద్విపద భారతము



నీలపుగోడల నిగుడుకోటలను
బ్రాలేయ కిరణ విస్ఫారవేదికల
మహిత విచిత్ర కోమల సౌధములను
మహనీయ దేదీప్యమానంబుగాను
నిర్మింప, సభయును నిఖిలరత్నముల
నిర్మలంబై యొప్పె ; నెఱయ నొక్కెడను
హరినీలకిరణ జలాంతరంబంగు
నరుణరత్నములు తోయజములై తోప,
రాజిత సితనవరాజీవ తతులు
రాజహంసంబులై రమణదీపింపఁ,
గమనీయ సౌవర్ణ కలశములనెడి
యమితకూర్మంబుల, నద్భుతంబైన
వైడూర్యములను బావనకుముదముల,
నీడెన్నఁగారాని హీరాంకురముల
మీనసంఘంబుల, మేటిముత్యముల
ఫేనపుంజంబులఁ, బెంపుగాన్పించు
మరకతమణులనుమహితశైవాల
భరమునఁ గనుపట్టెఁబద్మాకరంబు.
చెలువుమైఁ బటికంపుశిలలవిద్యుతులు
గలకుట్టిమంబులు కాంతులమించి
నయమొప్ప నదులుగా నలరుఠావులను,
బయలెల్ల జలము [1]లన్‌భ్రమపుట్టఁజేయు
కమనీయ మణివిటంక ప్రదేశముల,
సముచిత దశశత స్వచ్ఛహస్తముల
వెడలుపు నిడువుల విస్తారమగుచు
నొడికమై చిత్రమై యొప్పు తత్సభను

  1. లైప్రభ. (మూ)