పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

470

ద్విపద భారతము


వేయియేనుంగులు వేర్వేఱనిచ్చి,
యాయర్జునున కంత నరణంబు గాఁగ
[1] వేయిరథములు నూర్వేలధేనువులు
వేయి మదించిన వేదండమణులు
సింధుబాహ్లికపారసీక కాంభోజ
గంధర్వలక్షలు క్రమముతో నిచ్చి,
ధారుణీపతి యంతఁ దన్ను బూజింప
గోరిక లిగురొత్తఁ గొంత కాలంబు
విందులుగుడుచుచు వియ్యంకు లసక
యందు వినోదించి, యంత నందఱును
ద్వారక కేఁగుచోఁ, దాఁబోక వేడ్క
శౌరి యర్జునుతోడ సద్గోష్ఠి నుండె.

ఉ ప పాం డ వో త్ప త్తి


కాలక్రమంబునఁ గాంతసుభద్ర
యాలోన గర్భిణియై పుత్రుఁ గనియె.
అభిమన్యుఁడను నామమతనికి నిచ్చి
యభిమతి ధౌమ్యు డొయ్యనఁ జేసెఁగ్రియలు.
ద్రౌపదీ పుణ్యకాంతయు నంతఁ గ్రమము
దీపింప ధర్మసూతికిఁ బ్రతివింధ్యు,
నెఱయ వేడుకఁ బావనికి శ్రుతసోముఁ,
దెఱఁగొప్ప నింద్రసూతికి శ్రుతకీర్తి,
నలిఁబూర్వమాద్రేయునకు శతానీకు,
నలువొప్ప సహదేవునకు శ్రుతవర్మ
గాంచినఁ దోడ్తోనఁ గావించె ధౌమ్యుఁ
డంచితసత్క్రియ లక్కుమారులకు

  1. వేయిమదెమల నూరువేల (మూ )