పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

463


పరికించితిరె! యందుఁ బాండునందనుల;
నిరవొప్ప నర్జును నెఱుఁగంగఁగలరె?
ఆతఁడు తీర్థయాత్రార్థియై పోయి
యేతెంచెనే తిర్గి యిభపురంబునకు!
ఆతఁడు మాబావ; యతుల ప్రభావ,
చూతునొకో ! నేత్రసుఖ ముప్పతిల్ల;
నీవేషమున నటియించెడు నీవె
కావుగదా! కాంతిగల యర్జునుఁడవు."
అనుటయు నెంతయు నంతరంగమును
మనసిజుఁ డలయింప మమతవాటించి,
యక్కన్యమధురభాషామృతధారఁ
జొక్కి యాదేవేంద్రసుతుఁ డోర్వలేక
యిట్లను : "విను, నేన యింద్రపుత్రుఁడను;
ఇట్లు వచ్చితి నిన్ను నేఁ బెండ్లియాడ;
నీరూపమునఁగాని యిచ్చటి ప్రజలు
గారాముసేయరుగాన నిట్లైతి;
నొడఁబడివచ్చిన నుగ్మలి, రమ్ము;
తొడికొనిపోయెడ దొరలఁ గన్మొఱఁగి."
అనుటయు: 'హరి యీక నరుదేర వెఱతు;'
నని సిగ్గుతోఁ జెప్ప, నతివతోడుతను :
అంగజ[1]శాంతిగా నబల, నీతోడి
సంగతిలేకున్న సైరింపజాల;
ధరణీశ్వరులకు గాంధర్వవివాహ
మరహంబు ర" మ్మన నతివ సిగ్గునను:
"నన్నునీఁగర్తలున్నారు యాదవులు;
మిన్నక నాకెట్లు మేకొనవచ్చు!"
ననుచు సుభద్ర యంతఃపురంబునకుఁ (?)
జనియె; నర్జునుఁడును శయనింపఁబోయె.

  1. కాంతిగా (మూ)