Jump to content

పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

455


నగ్నికల్పుఁడను సంయమిచంద్రుఁ డొకఁడు
అగ్నిసమానుఁడై యటఁదపంబుండఁ
దొడఁగి యాతనిఁ జూచి తొలఁగక యేము
నొడలుండఁబట్టక నోలిఁ గట్టెదుర
నాటలుఁ బాటలు వలపుమాటలును
దేటలు నట తరితీపుసేయుటలుఁ
బచరించి, మఱియు బహువిలాసములఁ
బ్రచురమై మేనెల్ల బాటించి నిమిరి
చిన్నిచన్నులమీదఁ జేలాంచలములు
క్రన్ననఁ దొలగించి కడగంటఁ జూచి,
వాతెరకెంపులు వదనలీలలును
లేఁతనవ్వులు సూప, లేవకమ్మౌని
కనలి కెంపొదవంగఁ గన్నులువిచ్చి
తనమనోధైర్యంబు తప్పక పలికె:
'మత్తాత్మలార, యే మహితతపంబు
చిత్తశ్రమంబుగాఁ జేయుచునుండఁ,
గ్రొత్తలాగుల నిట్లు కుటిలవిఘ్నంబు
నొత్తిసేయఁగ మీకు యోగ్యమే యకట!
ఈదోషమున మీరలేవురుఁ బోయి
యాదక్షిణాంబుధి కనతిదూరమునఁ
దిరమగు నాపంచతీర్థంబులందు
బరఁగుఁడు జలచరీభావంబుదాల్చి;
నుసుగక యీరీతి నూఱేండ్లదాఁకఁ
బొసఁగంగ నుండుఁడు భువి; నంతమీఁదఁ
దీర్థంబులన్నియుఁ దిరిగియాడంగ
నర్జించి వ్రతధారియై యర్జునుండు
నచ్చోటి కేతెంచి యన్నిటఁ గ్రుంకి
యచ్చుగా మీశాప మడఁగంగఁజేయు.'