పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

450

ద్విపద భారతము


వింధ్యాది దక్షిణవిషయంబు చూచి,
సంధ్య [1]సేవించి యాశైలంబు నెక్కి,
విలసితబహురామ విద్రుమారామ
నలకాభిరామ దాక్షారామఁజూచి,
బెల్లంబుఁ బులగంబు భీమనాథునకు
విల్లెత్తుపొడవు నైనేద్యంబుచేసి,
బోగంబులాడెడు పువ్వుఁబోండ్లకును
జాగంబులిచ్చి యచ్చటనుండికదలి,
తాలాంకబలుఁడు గోదావరినాడి
లీలమార్కండేయలింగంబునకును
జేవపాయసమునఁ [2]జెరవచేయించి, (?)
సేవించి యటఁబోయి శ్రీశైలమెక్కి,
మంత్రస్వరూపుని మల్లికార్జునుని
మంత్రపుష్పమువెట్టి మణులఁ బూజించి,
యందులతీర్థంబులన్నియు నాడి,
కెందామరలనొప్పు కృష్ణకునడచి,
విజవాడశివుని సంప్రీతితోఁ గాంచి,
ద్విజులకుఁ గనకంబు తృప్తితోనొసగి,
హరునిఁబూజలు చేసి, యంతనాకొలని
తిరునాళ్లుచూచి, యాదేవదేవునకు
బసిఁడిపళ్లెరములు బట్టువస్త్రములు
బశులు ధాన్యములు సంపాదించియిచ్చి,
భక్తవత్సలు నహోబలనారసింహు
భక్తిపెంపునఁజూచి, భవనాశిదోఁగి,
యన్నదానమువెట్టి యటఁగాళహస్తి
గన్నారఁజూచి, వేంకటగిరియెక్కి,

  1. శేషించి
  2. చెరుపు (మూ)