పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

429


[1] బరువడి నంకురార్పణము గావించి,
దొరఁకొని మంగళ తూర్యముల్ మ్రోయఁ
గన్నియఁగైసేయఁగా నియమించి,
యన్నియత్నంబులు ననువులుచేసె.
ఇట పాండవులు ధౌమ్యు నెలమిరప్పించి,
పటుతర భాగ్యసౌభాగ్యంబు మెఱయ,
వందిబృందములు కైవారముల్ సేయ ,
దుందుభి ఫటహాది తూర్యముల్ మ్రోయ,
మణిగృహంబులలోన మానినీమణులు
ప్రణుతవైఖరి నెల్ల పనులకుఁ దిరుగ,
సలలితమంగళస్నానముల్ చేసి
చెలువుమీఱంగఁ గైసేసి రేవురును.
స్నాతక వ్రతములు సకలంబుఁదీర్చి,
భూతలాధీశులు పొడసూపునట్టి
విప్రులఁబూజించి, వేదఘోషముల
సుప్రశస్తంబైన శుభలక్ష్మితోడ
ధవళవస్త్రంబులు ధవళమాల్యములు
ధవళగంధంబులుఁదగు వేడ్కఁదాల్చి,
యనుపమంబగులగ్నమాసన్నమగుట
విని మహోత్సవమున విడిదికి వెడల,
స్యందనకోటులు సందడింపంగ
నిందిరావల్లభుఁ డెదురువచ్చినను,
భావింప దైవంబు ప్రత్యక్ష మగుట
నేవేల్పులకు దారె యెక్కుడై నృపులు
రథముల నిజమనోరథముల నెక్కి
పృథివి యాకాశంబుఁ బెనఁచుకచూడఁ,
 

  1. పనిపడిశంకురార్వణము. (మూ)