పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

ద్విపద భారతము


ఈ తేరువిప్రుల; కీ తేరునృపుల;
కీ తేరువైశ్యుల; కిది శూద్రులకును.
వీనిలో నొక తేరు విభులార, యెక్కి
జానొప్ప ద్రౌపదీసహితులై రండు. "

పాండవులు ద్రౌపదీ సహితులై ద్రుపదునగరి కేఁగుట

అనిన, ధర్మతనూజుఁ డట్ల కాకనుచు
ననుజులుఁ దాను నొయ్యన రాజరథముఁ
బరువడినెక్కినఁ, బంచాయుధములు
హరిదాల్చినట్లయ్యె నయ్యరదంబు.
అత్తయుఁ గోడలు నందలంబులను
ముత్తైదువలమూఁక మొనసియేతేరఁ,
బంచపాండవులును బాంచాలుసభకు
నంచితలక్ష్మితో నరుదెంచునపుడు
నెడనెడ నెదురుగా నీప్సితార్థములు
జడియక ద్రుపదుండు జాతిజాతులకు
రసికతఁబుత్తేర, రాజయోగ్యముల
వెసఁగయికొనుచు నవ్వీరులువచ్చి
రాజయోగ్యములైన రత్నాసనముల
నోజతో గూర్చుండి రుచితంబుగాను.
ఎంతైనఁ దమ్ముఁదా మెఱిఁగించుకొనక
కౌంతేయులని యెఱుంగఁగరాదు గాన,
వారలఁబూజించి, వసుధేశుఁడాత్మ
నేరూపమును నిర్ణయింపంగరాక
తిన్నన ప్రియముతోఁ దెలియనిట్లనియె:
"ఎన్నఁ బుణ్యశ్లోకు లెవ్వారు మీరు?
రామఁ గైకొన నమరావతినుండి
భూమిడిగ్గిన దివ్యపురుషులో! కాక,