పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

396

ద్విపద భారతము


నలుఁగడనిగుడు బాణప్రవాహములు
కలనువట్టని పాటి క్రందునఁబఱపి,
“యదెపోయెఁబోయె భీమానుజుం డనుచుం
త్రిదశులు దివిఁజూడ ద్విజకోటియాడ,
నాతిధైర్యమువీడ, నారదుఁడాడ,
[1]నాతూపు నెఱినాడ, నతఁడల్కతోడ
[2]నగి పెద్దలడుగుప్రశ్నములకు సరిగఁ
దగ యాజ్ఞవల్క్యుఁ డుత్తరమిచ్చినట్లు
కౌరవ కాళింగ గౌడాంగ వంగ
కేరళ కేకయ [3]కీచక సాళ్వ
చేది జరాసంధ సింధు గాంధార
వైదేహ బాణప్రవాహంబు లెల్ల
ఘోరాస్త్రతతియను కుంభజుచేతఁ
బారణసేయించి పార్థుఁడుప్పొంగె.
[4] (అప్పుడు శల్యుండు నంగాధిరాజు
ముప్పిరిగొనుకోపమును సంభ్రమంబు
నీనును గదురఁ దీవ్రేషుజాలముల
నేసిరాపవనసురేంద్రనందనుల;)
ఏయుచో నొక్కమహీజమ్ము వెఱికి
వాయునందనుఁడును వారిపైఁగవిసె ;
వారిరువురు నంత వజ్రసంకాశ
ఘోరబాణంబులు గురిసిరి మిగుల;
ఆపవనజుచేత నరిరాజసేన
చాపకట్టై త్రెళ్లె సమరమధ్యమున.
రణభూమి యీక్షింపరాక దేవతలు
మణివిమానములెక్కి మరలిరి దివికి.

  1. నాదూపు
  2. దొగి
  3. కీచకాస్వాంత
  4. గ్రంథపాతమగుటచే సందర్భానుసారముగా నీపంక్తులు చేర్చఁబడినవి. (మూ)