పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

390

ద్విపద భారతము


లలి మత్తకరి యిక్షులతయెత్తినట్టు
లలవోక విల్లెత్తె నమరులవొగడ.
ఎక్కు వెట్టినవేగ మెవ్వరుఁగాన
రక్కన్యకయె కాంచె హరిమున్నె కాంచె
పెనఁచినగొలుసుల ఫెళఫెళధ్వనుల
ననిచి యొక్కటిగాఁగ నారిసంధింపఁ,
గలగె నంభోనిధుల్; కంపించె గిరులు;
తలఁకిరి సప్తపాతాళవాసులును;
పరఁగఁ బ్రత్యాలీఢపాదుఁడై నిలిచి,
పురలక్ష్యమీక్షించుభూతేశువోలె
నేనమ్ము లొక్కట నేయనుంకించు
మీనకేతుఁడువోలె మీఁదమీనమర
హరిమెచ్చ హరిమెచ్చ నఖిలంబుమెచ్చ
శరములిమ్ములవెంట సంధించి నరుఁడు
ఆననాంబుజమెత్తి, యంతరిక్షమునఁ
గానవచ్చియురాక కడుసూక్ష్మరేఖఁ
జపలచిత్తమువోలెఁ జలియింపుచున్న
కపటలక్ష్యముఁగాంచి, కళవళపడక
తప్పనిచూడ్కి నందలిమర్మమెఱిఁగి
యొప్పునాత్మనుగన్న యోగియు వోలెఁ
గర్ణాంతకృష్టభీకరమౌర్వినుండి
తూర్ణవైఖరిఁ బాఱఁ దూపులేయుటయు,
నవి హంసములువోలె నంబరవీథి
నీవలావలఁబోక యేకమై నడవ,
నంచితగతి లక్ష్యమనుమృణాలమును
ద్రుంచి, యంతటఁబోక తోడ్తోననెగసి
లీల నేగురపెండ్లిలేఖలాయింద్రు
ప్రోలి కర్జునుఁడంపఁ బోయినట్లరిగె.