పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

384

ద్విపద భారతము



తరుణి, యీతఁడు పరంతపుఁడనువాఁడు
మరహాటకామినీ మదనమంత్రంబు ;
వీనిశాత్రవగేహ విపినమధ్యమున
నీనినపులులుండు నెందునుబోక.
భూరిశ్రవుఁడు వీఁడె పూఁబోఁడి,చూడు
ధీరుఁడు బాహ్లీక దేశనాయకుఁడు ;
బలుఁడు భీముఁడు సింహబలుఁడు మాగధుఁడు
బలమునఁ దనతోటిపాటివారనుచు
నెక్కువలావున నెపుడు మట్టాడుఁ
జొక్కించుమగవానిఁ జూడుమా శల్యుఁ
జేదీశు నిటుచూడు శిశుపాలు నబల!
[1]ఈదృక్ శుభమువిని యెదిరి శూరులకు
బలవంతమున నైన భామిని, నిన్ను
వలవంతఁ గొనిపోవ వచ్చినవాడు.
మధురిపుఁడెవ్వనిమహిమకుఁ గాక
మధురనుండక పోయె మహినొక్కపురికి;
రాకేందువదన, జరాసంధుఁజూడు
కైకొనఁ డీవిల్లు కసవునకైన  ;
అవనీశవరుల సహస్రసంఖ్యలను
శివగాత్రికై వీఁడు చెరఁబెట్టినాఁడు.
జగతి నక్షోహిణిసంఖ్యలుగలుగు
పగ రాక్షసులఁజంపి ప్రజలలో నిపుడు
సాధులాగుననున్న జగదేకనాథుఁ
డాదినారాయణుండైన దేవుండు
బాణాసురునితోడి బవరంబునాఁడు
బాణునిపై పూని భవుఁడువచ్చినను
 

  1. యేది శుభము. (మూ)