పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; షష్ఠాశ్వాసము

377

గుమ్మరవాడలో గుణియైన యొక్క
కుమ్మరివానింట గుఱుతుగా విడిసి,
భిక్షాన్నములుదెచ్చి ప్రియముతోఁ గుడిచి
యక్షీణసుఖనిద్ర నందిరారాత్రి.
అంత స్వయంవరంబందుఁ బాండవులు
కాంతఁగైకొన రాచగమిమోములెల్లఁ
దెల్లనౌనిట్లని తెలిపినమాడ్కిఁ
దెల్లఁబాఱె సురేంద్ర [1]దిగ్భామ మొగము ;
పుండరీకాక్షునిఁబొడగన్న నయన
పుండరీకంబులు బోరన నెల్లి
వికసించుఁ బాండవవిభులకన్నట్లు
వికసించెఁ గొలఁకుల విరిదమ్మిగములు;
విభులోలిఁ దమచేత విలువంపరాక
సభయులై యొండొండ జరుగుదురిట్టు
లని చూపిచెప్పినట్లాకాశవీధి
వెనుకొని చుక్కలు వచ్చిపోఁ దొణఁగె;
ద్విజరూపధరుఁడెల్లిఁ దివియుఁ గార్ముకము
ద్విజకులంబులకెల్లఁ దేజంబువచ్చు
నని వేడ్కఁ దమలోన నాడుకొన్నట్లు
గొణఁగఁజొచ్చె ద్విజాలి గూడులలోన;
వారణావతములో వహ్ని పాండవులఁ
బారణగొనెనని ప్రజలాడుకొనఁగ
నానిందఁ బాపుగో నగ్ని రాఁబోలు
నీ నెలవునకన నెఱసంజ దోచే;
విజయాస్త్రములఁ ద్రెవ్వు వీరులకెల్ల
గజవీధి యుసగంగఁ గాలకాలమున (?)

  1. దిగ్భాగచయము (మూ)