పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

368

ద్విపద భారతము


వినయ సద్భక్తితో వీక్షించి పలికె :
“అనఘాత్మ, నీచేత నణఁగె శాపంబు ;
చనియెద నేనింక జనపదంబునకు;
నెనసిన వేడ్క నీవేతేరవలయు. "
అనవుడు మౌనియు నంగీకరించి
పొనర నారాజన్యుపురికి నేతెంచె.
అపుడు కల్మాషపాదావనీశ్వరుఁడు
తపసియుఁ దానును దనపురంబునకు
నేతెంచి, మంత్రుల నింతులఁగూడి
యాతాపసారాధ్యు నర్చించి మ్రొక్కి
ప్రణుతించి పలికె : " నోభవ్యాత్మ, నాకు
గణుతింప మునిశాపకారణంబునను
మగువఁ గూడఁగరాదు మరణోక్తి భీతి ;
మగవాని నొక్కని మదయంతియందుఁ
గులమెల్ల నిలుపంగఁ కుదురైనవానిఁ
జెలువుగా నీవయ్య! క్షేత్రజుఁగాను.
అనుచుఁ బ్రార్థన చేయ నతఁడు గైకొనుచు
మనుజేశుసతియైన మదయంతియందు
నొక పుత్రు నుత్తము నుదయింపఁ జేసి
ప్రకటించి రాజుచే బహుమానమంది
యచ్చోటువీడ్కొని యాశ్రమంబునకుఁ
జెచ్చెరనేతెంచె శిష్యులుగొలువ.
అంత నదృశ్యంతి హర్షంబుతోడఁ
గాంతిమంతునిఁ బుత్త్రు ఘనతపోధనుని
రవినిభతేజుఁ బరాశరుంగనియె.
అవసరంబునవచ్చి యావసిష్ఠుండు
సకలకర్మంబులు శాస్త్రోక్తిఁ జేసి,
ప్రకటించి పెనుపంగఁ, బ్రబలి యాసుతుఁడు