పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

362

ద్విపద భారతము


బఱచియుఁ బొడిచియుఁ బాఱఁదోలియును,
మెఱమియు మెట్టియు మెల్లెవాపియును (?)
గడిమిమైనేతేరఁ, గౌశికుబలము
తడయక యాకుఱ్ఱి దండిమైఁగదిసి
యేచి యార్పులు బొబ్బలిడుచు నందంద
నేచందముననైన నిట దీనినిపుడు
పట్టకున్ననుగాదు పౌరుషంబనుచుఁ
జుట్టిరా రథ దంతి సూతులనిలిపి,
యొత్తి యల్లనడాసి యెదిగి డాకాల
హత్తించి యొకపల్లె నదిబిగియించి
తలకోల దగిలించి తాళ్లనుబట్టి
పలుమాఱు కోలలపాలుసేయుటయు,
సంసారబంధముల్ సరి విడఁదన్ను
కంసారిసముఁడైన ఘనయోగివోలె,
నందికోపించి యంతయుఁ బాకసమితి
నందంద తెగదన్ని'హంబా', యటన్న,
గోమయంబున దాని ఖురరోమములను
సామర్థ్యముప్పొంగ శబరకోటులు ను
క్షితియదరఁ బుళింద సింహక ద్రవిడ
తతులనేకులు బల్మిఁ దడయక పుట్టి,
పరశు తోమర కుంత పట్టస ప్రాస
పరిఘ గదా శూల బాణాసనాది
వివిధాయుధంబులు వీరులై తాల్చి
జవ మొప్పఁ గౌశికు సైన్యంబుఁ దాఁకి
రథముల విఱిచి, సారథులఁగారించి,
రథికులవిదళించి, రథ్యాళినొంచి,