పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

ద్విపద భారతము


సల్లీల దీనికి సరియైనసతుల
నెల్లలోకంబుల నేఁగాంచియెఱుఁగ.
చిత్తంబులో బ్రహ్మ చెలువొప్పఁ దలఁచి,
హత్తింపనోపు నీయబలరూపంబు;
కాక, చిత్తురువునఁ గ్రమమొప్పవ్రాసి
జోకఁ బ్రాణము మఱి జోడింపఁబోలు;
దైవకన్యకయొ! గంధర్వకన్యకయొ!
భూవరకన్యయో! భూదేవసుతయొ!”
అని యిట్లుతలపోయు నారాజచంద్రు
మనసిజాకారుని మానినిఁజూచి
మెఱయుమేఘములోనిమెఱుఁగునుబోలెఁ
దెఱవ వేగంబె యదృశ్యయై పోయె.
పోయిన, నారాజు పొలపొలవోయి
ధీయుక్తి నెంతయుఁ దిరిగిరాఁజూచి,
వినువీథియునుజూచి విస్మయంబంది
తనమనంబున నిట్లు తలపోయఁదొణఁగె :
"ఈకన్య యెందుండి యిటవచ్చెనొక్కొ!
కాక యీతేజంబు కాంతయొ కాదొ!
వలరాజుమాయయో! వనలక్ష్మియొక్కొ!
తెలియంగలేనైతి దిటతప్పెనపుడు;
అనుమానమటుమాని యాలేమఁగదిసి
చనుమానమున వేడ్కసలుపలేనైతి;
చేతనుండెడిసొమ్ము చిందంగ వైచి
బ్రాఁతితో వెడలెడుపందఁబోలితిని;
చేరినమృగనేత్రఁ జెందంగలేక
జరంగవిడిచి నే జాలిఁబొందితిని."
అనుచు సంవరణుండు హత్తినమోహ
వినతుఁడై, యెంతయువిరహాగ్నిఁబొంది,