పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

323


“ ప్రొద్దువోయినఁగాదు పొరిగొనువీనిఁ;
బెద్దసేయకుభీమ, బెగడెడుఁగుంతి.
కయ్యంబు వెండియుఁ గలిగెడుఁ గాని,
యియ్యగ్రభుజుఁగూల్పు, మిదిదైత్యవేళ.
అనిన వాయుజుఁ డట్టహాసంబుచేసి,
మనుజభోజను నూఱుమాఱులు దాఁకఁ
గడకాలువట్టి యాకసమునఁద్రిప్పి
పుడమితో వ్రేయుచుఁ, బోనికోపమున
వెసఁద్రొక్కి, కోలెమ్మువిఱిచి, దిక్కులకు
నసురఁ బాఱఁగవైచె నమరులువొగడ.
కలిగే సంవత్సరగ్రాసమై వాని
పొలను రక్తంబు జంబుకభూతములకు.
అనిలజుపై నంత నప్సరస్ స్త్రీలు
గొనకొని కురిసిరి కుసుమవర్షములు.
అప్పుడు ధర్మరాజంబయుఁ దాను
నుప్పొంగి కౌఁగిట [1]నొదిగించె భీము."
అనియిట్లు జనమేజయావనీంద్రునకు
మునిచెప్పెనని చెప్ప మోదించిమునులు:
'అనఘాత్మ, తరువాతనైనవృత్తాంత
మనువొప్పఁజెప్పవే!' యని యడుగుటయు,
ఇదిసదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాసమొప్పె నేనవది.

——♦♦♦♦§♦§♦♦♦♦——

  1. నొనరించె (మూ)