పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

ద్విపద భారతము


ఆమహాధ్వనివిని యట నిద్రదెలిసి,
భీమునిఁగానక పృథయుఁ బార్థులును
జింతించి, రాక్షసస్త్రీనొద్దఁగాంచి ;
“యింతచక్కనిశాంత యెట్లొకో గలిగె!
ధాత్రికిఁదిగిన గంధర్వకన్యకయొ!
చిత్రమీరూపంబు! క్షితిలోన లేదు;
ఇది భీమువృత్తాంత మెఱుఁగుఁబొమ్మనుచుఁ
గదిసి యందఱునడుగఁగ, వినయమున
నది చెప్పె : "మీభీముఁడసురతో వాఁడె
చెదరక కయ్యంబు సేయుచున్నాఁడు.
ఆరాక్షసుని చెలియల నే హిడింబ;
నీరూపుగైకొంటి నిందఱువినుఁడు.
అలవోక మిమ్ము మాయన్న హిడింబుఁ
డిలఁగూల్చి తెమ్మని యిటనన్నుఁబనుప
వచ్చి భీమునిరూపవైభవంబునకు
నిచ్చ నేఁజొక్కుచో, నెఱిఁగి రాక్షసుఁడు
మీతోడ నన్నును మ్రింగెదననుచు
నేతేర, మీనిద్ర యెడలునోయనుచు
వాతనెత్తురులొల్క వాని వాతుల
సూతి దవ్వుగనీడ్చి శూరతమెఱయ
నచ్చోటఁబెనఁగెడు; నసురవధించి
వచ్చునింతట.” నన్న వారు బిట్టులికి
యుదరాగ్ను [1]లొదుఁగ నయ్యుదకంబు ద్రావి,
కదలి యాహవభూమిఁ గదియవచ్చుటయు,
నసురఁగౌఁగిటనూఁది యనిలనందనుఁడు
వెసవానివ్రేయుచో, వీక్షించి నరుఁడు :

  1. లొలుక (మూ )