పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

ద్విపద భారతము


ఇల సూతగోత్రుగా నెఱిఁగితి మితనిఁ;
గులమేలడాఁగును గోటి చెప్పినను,
కుక్క యందలముపైఁ కూర్చున్నయపుడె
.................................................
అంగరాజ్యమునకు నర్హుండె వీఁడు!
సంగతిఁ జనుఁగాక సారథ్యమునకు."
అనుడు దుర్యోధనుం డతనికిట్లనియె:
"తనకన్నుగానఁడు ధరణినొక్కొకఁడు!
శూరులజన్మంబు, సురలజన్మంబు,
భూరి నదీజన్మములుఁ గాననగునె!
శరవణంబునఁగాదె! జనియించెగుహుఁడు,
శరముకందువఁగాదె! జనియించెఁగృపుఁడు;
ఘనకుంభమునఁగాదె! గలిగె ద్రోణుండు;
మునినేత్రమునఁగాదె! మొలిచెఁజంద్రుండు;
తలఁప మీపుట్టువు తానెట్లు చెపుమ!
వలదన్నమానరు వాదంబుత్రోవ,”
అనిపల్కు నంతలో నర్కుండు గ్రుంకె
ఘన సహస్ర కరదీపికా దీప్తితోడ
గురునకుఁ దండ్రికి గురురాజు మ్రొక్కి
యరిగెఁ గర్ణుఁడుగొల్వ ననుజులుగొల్వ,
ధృతరాష్ట్రుఁడును రత్నదివ్యాంబరముల
శతసంఖ్యకరుల నాచార్యుంబూజించి,
యందఱననిచి రథారూఢుఁడగుచు
మందిరంబునకేఁగె మగువయుఁ దాను.
మఱునాఁడు ఱేపాడి మనుజేంద్రసుతులఁ
దెఱఁగొప్ప నాచార్యతిలకుండుచూచి: