పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము


శ్రీ రామవిఖ్యాత, చిరతరోల్లాస,
నారీనుతక్రీడ, నరసయచౌడ,
తక్కక కర్ణావతారుండవనఁగ
దిక్కుల వెలయు మంత్రీ, చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పదొడఁగె.

ధనుర్విద్యా ప్రదర్శనము



కురుకుమారులకెల్ల కోదండవిద్య
గురుఁడిచ్చి, యొకనాఁడు కొలువులోపలను
ఆంబికేయునిఁబల్కు: "ననఘాత్మ, నీవు
[1]సంబంధియుతుఁడవై సభ్యులఁగూడి
నీకుమారుల కేను నేర్పినవిద్య
ప్రాకటలీల నొప్పనగొందుగాక ,
తజ్ఞులువీక్షించి తగునన్నఁదాఁక
విజ్ఞానిననరాదు విద్య నెవ్వరికి.
శరములుదూలింప సంధించునపుడు
గరిడివిస్తీర్ణంబుగాకున్నఁ గాదు.
[2]వాస్తుశాస్త్రజ్ఞులు వసుమతీసురులు
విస్తరింపుదురొప్ప విభుఁడ, యాస్థలము ;
పేర్చి భేతాళునిపీఠంబు తొలుత
దీర్చి యా వేల్పుఁ బ్రతిష్ఠింపవలయు ;


  1. సంబుద్ధి
  2. వస్తు (మూ)