పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

283


విడువకయుండిన, విడిపించుకొనఁగఁ
గడునేర్చియును శిష్యగణముతోనపుడు
విడిపింపుఁడోదీనివెరవుతో!' ననిన
విడిపింపనేరక వివశులైవారు
నేయఁగానెట్లొకొ యీతనికనుచు
నాయనువెఱుఁగక యందఱువీఁగి
యున్నచో, నర్జునుండొకమేటిరథము
పన్ని సూతుఁడుతేరఁ బటుగతినెక్కి,
శరచాప ముద్గర శక్తి వజ్రాది
పరశు తోమర ఖడ్గ పట్టిస ప్రముఖ
వివిధాయుధంబులు వెస సంతరించి
యవిరళగతిరాఁగ నతని వీక్షించి:
" పగతులిచ్చట లేరు పన్నిపోరాడ
మగంటిమిమెఱయ; నీమకరికిం తేల
తనకునుద్ధతి!" యనుధార్తరాష్ట్రులను
గనుఁగొని పార్థుండు కడఁకనిట్లనియె :
"శరగురుండల్పుండె! చర్చింపమనకు;
భరమున నాతనిఁబట్టినమొసలి
యలఁతులఁదీఱునే ! యనువులఁగాక !
వలయునిన్నియు". ననివాసవాత్మజుఁడు
వెసఁజేరి గురునకు వినయంబుతోడ
'మొసలిమిమ్మెచ్చోటముట్టెనో !' యనఁగ,
శోకాతురత్వంబు చొప్పడునట్లు
ప్రాకటంబుగ గురుప్రవరుఁడిట్లనియె:
మకరి పెందొడవట్టి మడుఁగులోపలికి
బెకలించుకొనిపోవఁ బెనఁగుచున్నదియు;
పదములుధరనూది, పదిలమేమఱక
యుదకమధ్యంబున నుండితి మింత;