పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

ద్విపద భారతము


కృపాచార్యుల వృత్తాంతము



అంతఁ, గృపాచార్యుఁడను విప్రధన్వి
కాంతాసమేతుఁడై కాంతిమిన్నంది
యరుదేరఁగా, భీష్ముఁ డతని రావించి,
[1]పురువంశవిధుచేతఁ బూజచేయించి :
"యెవ్వరు మీరు? ము న్నెచ్చోటివార?
లివ్విల్లు మీచేత నెంతయు నొప్పె;
నెఱుఁగుదురా దీని నేమైన?” ననినఁ
జిఱునవ్వు దళుకొత్తఁ జెప్పె నాకృపుఁడు :
"నరనాథ, గౌతమునకు నహల్యకును
శరచాపహస్తుఁడై జనియించినట్టి
వీరుండు మాతండ్రి విను [2]శరద్వంతు;
ధారుణి నతఁ డుగ్రతపము సేయంగ,
శతమఖుఁ డంతలోఁ జింతింపఁదొణఁగె: (?)
“ఇతఁడు కైదువుతోడ నిలఁ బుట్టి తొలుత,
నటమీఁదఁ దపముసేయఁగఁ జొచ్చె; దీన
నెటుహాని పుట్టునో! యిటునమ్మరాదు;
ఇంతట మాన్చెద నీతపం" బనుచుఁ
జింతించి యప్సరస్త్రీల రావించి,
జలపదియనుదానిఁ జక్కనిదాని
బిలిచి, యచ్చెలువతోఁ బ్రియములు సెప్పి :
"తరుణి, గౌతమపుత్త్రుతపము విఘ్నంబుఁ
బొరయింపు;" మని పంపఁ, బోయి యవ్వనిత
కలికి గాడ్పున మేను గందునో యనుచుఁ,
జిలుకౙంకెల నాత్మ చెదరునో యనుచు,
వింతఠావున దృష్టి వీఁగునో యనఁగఁ,
గాంతి మేదినిఁ గొంతగాఱునో యనఁగ,

  1. పురవంశవిధి
  2. 'శరద్వంతుఁ'డని నన్నయ. (మూ )