పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

231


నెదురుగానట్టి మీ రేతెంతురట్టె!
పొదలు దివ్యుఁడఁగానె! బొందితో నేను."
అనుటయు, దేవత లతనిఁ గీర్తించి
చని రంత నిజనిజసదనంబులకును.
కుంతికి నీరీతిఁ గొడుకులు గలుగ
సంతతోత్సాహుఁడై, సంభ్రమం బెసగ
నంతట శతశృంగమందుఁ బాండుండు
సంతోషచిత్తుఁడై, సంయము లలర
సతులతో సుతులతో సతతంబు గూడి
యతివినోదములఁ బెంపలరుచునుండె.
ఆలోన మద్రరాజాత్మజ మాద్రి
భూలోకవినుతులఁ బుత్త్రులఁ దనకుఁ
బడయునుపాయంబు పరికింపలేక,
యెడఁదలోఁ బలుమాఱు నిట్లనితలఁచె:
"కోరినతనకోర్కి కొదవడకుండ
వారిజానన కుంతి వసుధేశుఁ డలర
సురుచిరాకారుల శూరుల ఘనుల
గురుమతితోఁ గాంచెఁ గొడుకుల ముగురి;
గాంధారి కొడుకులఁ గాంచె నచ్చోట
బంధురలీలలఁ బరఁగ నూర్వురను;
నుతికెక్కఁగా వారు నోచిననోము
నతివేడ్క నే నోమనైతినొకాక !”
అనితలపోసి యయ్యధినాథుకడకుఁ
జని, మాద్రి దుఃఖించి జానొప్పఁబలికె:
"ఆఁడుపుట్టువు పుట్టి యక్కట! నాకుఁ
బోఁడిగా లేదయ్యెఁ బుత్త్రలాభంబు;
కొడుకుల నాతోడికోడలు గాంచెఁ
గడువేడ్క నూర్వురఁ గ్రమము మీఱంగ,