పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

225


ఒక్క సూనుఁడువలె నుల్లోకబలుఁడు
గ్రక్కున యత్నంబు గావింతుగాక;
భూరిహోమములేక పుత్త్రకామేష్టి
నీరూపమునను సన్నిధియయ్యె నాకు. "

భీమజననము



అనినఁ గుంతీదేవి 'యట్ల కా' కనుచు,
ననిలుని నారాత్రి యాత్మలోఁ దలఁచె.
తలఁచిన, నతఁ డెల్లతనువులయందుఁ
గలవేల్పుగాన నాక్షణమున వచ్చి,
మంత్రింప మనుజుఁడై మగువతో మదన
తంత్రమార్గమున నాతఁడు ప్రవేశింప
నింతి గర్భము దాల్చె; నేఁడు నిండుటయు,
నంతంత గ్రహములు ననుకూలగతుల
వింతయై వర్తింప, విపులప్రతాప
సంతతోత్సాహునిఁ జండతేజునిని,
ఆవాయుదేవుని యంశంబునందు
భావజాకారుని భామాలలామ
యొనర గాంధారి దుర్యోధనుఁ గనిన
దినమునఁ దనయు సుస్థిరతేజుఁ గనియె.
సురదుందుభులు మ్రోసె; సురపుష్పవృష్టి
కురిసె; వేదంబులు ఘోషించి పలికె;
భయమయ్యెఁ గిమ్మీరబకహిడింబులకు;
జయజయధ్వనియయ్యెఁ జదల నెల్లెడల;
తనయుని వీక్షింపఁ దా వచ్చె ననఁగ
ననుకూలపవమానుఁ డల్లన వీచె.
హేమకిరీటుల నితఁడు శాత్రవుల
భీమంబుగా నాజి భేదించుఁగాన,