పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

207


'యధమత్వ [1]మీగతి నందితి' ననుచు
విధి నాత్మదూఱుచు వేదనతోడఁ
గొండొకద వ్వేఁగి [2]గొంతులఁ బలికె :
“పొండు మి మ్మనిపెదఁ బురవరంబునకు;
నత్తల సేవించి యట నుండుఁ డీరు;
తత్తరించినఁగాదు; తప్పెఁగార్యంబు;
మనచేత మునులును మరణంబుఁ బొంది
మనకును నొకకీడు మఱి చేయకుండ్రె!
ఇంక నెక్కడిరాజ్య! మిం కేటిసుఖము!
ఇంక నా కీశాప మేమిటఁ దిరుగు!
వలనొప్పఁ గౌరవాన్వయపయోరాశి
బలమఱి యీశాపబడబాగ్ని నింకె!
........ ...... ...... ....... ....... ....... .......
కడ తేరె నీశాపకాలాహిచేత.
నే నింక భోగంబులిన్నియు విడిచి,
మానావమానముల్ మమతయు విడిచి,
సకలపాపంబులసమితియు విడిచి,
ప్రకటితనిజకర్మఫల మాసవడక,
యడవిని నిత్యఫలాహారనియతిఁ
గడపెదఁ గాలంబు కడముట్ట నిపుడు ;
పుడమి యేలఁగ నాకు బుద్ధిగా; దింకఁ
గడుఘోరతపము నేఁ గావింతు నిచటఁ;
గాన, మీకిప్పుడు కానల నవయఁ
గానేల! చనుఁడింకఁ గరిపురంబునకుఁ;
జని, యెల్లవారి కీచందమంతయును
వినిపింపు." డనిన, నవ్వెలఁదు లి ట్లనిరి:

  1. మీగితినందు నేననుచు.
  2. 'గొంతి' పదమును స్త్రీపర్యాయముగా వాడినాఁడనవలెను ; లేదా గొంతతో అన్నను సరిపడును. (మూ)