పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

ద్విపదభారతము


తెగనేయుమృగమును, దెగనేయరాని
తగవెఱుంగక యేలదాయవై తిపుడు!
అలసి మేయుచునున్న యాఁకొన్న మృగముఁ,
జులకగాఁ బోలేక చూల్గొన్నమృగము,
నీరాసఁగా వచ్చి నిలిచిన మృగము,
నీరీతి రతికేళి నెనసినమృగముఁ,
మూలకు ముట్టుగా ముదిసినమృగముఁ,
బోలేక మృగములఁ బొదివినమృగము
బోయయు నేయఁడు; భూపాల, తగునె!
నాయంబు దప్పితి నాయెడాటమున.
తగునయ్య! యేను గిందముఁడను మునిని;
మృగమాత్రమని చూచి మేను మఱచితివి;
అతివయు నేనును హరిణరూపముల
రతిసల్పుచున్నవారము వేడ్క పుట్టి.
అది యెఱుంగక యేసి తకట! యోరాజ;
మొదలంట మాప్రాణములు నిల్వ విఁకను.
ప్రతిలేని యీపాపఫలమున నీవు
సతిఁ గూడినప్పుడె చత్తువుగాక;
మానినియును నీకు [1]మాద్రి సహాయ
మౌ." ననిశపియించి, యాలును దానుఁ
బరలోకగతుఁడయ్యెఁ; బాండురా జపుడు
తరుణులఁ జూచి, యెంతయుఁ జిన్నవోయి,
శరములుఁ జాపంబు జారంగ విడిచి,
తొరఁగెడుకన్నీటితో వెచ్చనూర్చి,
యనలసంస్కారంబు లామృగంబులకు
నొనరించి, సరసిలో నుదకంబు లిచ్చి,

  1. మౌన (మూ)