పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

ద్విపద భారతము


ధర్మంబులన్నియుఁ దనకుఁ దోడుగను
ధర్మాత్ముఁ డితఁ డనఁదగి చరింపుడును,
బరభూమిపతుల కప్పంబులఁ గొనుచుఁ
దిరముగాఁ గృతయుగస్థిర[1]భూతి దనర,
సరసత ధృతరాష్ట్రుశాసనంబునకుఁ
దిరముగా జనుల వర్తింపఁజేయుచును,
అనఘు నాధృతరాష్ట్రు యౌవనారూఢుఁ
దనరఁ బెండిలిసేయఁ దలపోయుచుండఁ,

ధృతరాష్ట్రుఁడు గాంధారి నుద్వాహమగుట

బ్రబలుండు గాంధారపతియైనయట్టి
సుబలునికూఁతురు సురుచిరాకార
కమనీయరూపరేఖావిలాసముల
నమరకాంతల కెనయైనది యనియు,
గురుమతి నూర్వురు కొడుకులఁ బడయ
వరము వ్యాసునిచేత వడిఁ గాంచెననియు,
సొరిది నిత్తెఱఁగు భూసురులచే నెఱిఁగి
యరుదారమోదించి యప్పు డుప్పొంగి,
యాశాంతనయుఁడైన యాశాంతనవుఁడు
శైశవాంతరమున జనపతిఁ జూపి
విదురున కిట్లను : "విదుర, యీరాజు
సదమలతేజుండు, సత్యసంధుండు,
వెలయ మదించిన వేయిదంతులకుఁ
గలలావు గలవాఁడు, గాంభీర్యజలధి,
పెండ్లిచేసెదఁగాక పెక్కండ్రుసుతుల
నిండ్లునిండఁగఁ గాంచు నితఁడు మోదమునఁ;

  1. భూమి (మూ)