పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

ద్విపద భారతము


అనుచుఁ బార్థివచంద్రుఁ డాశకుంతలను
'జనుము లోనికి' నని శాసించి పలికి,
పులకలు మే నెల్లఁ బొదలి భూషింప
నలఘుశౌర్యునిఁ బుత్త్రు నందంద యెత్తి,
బిగియఁ గౌఁగిటఁజేర్చి, ప్రియమొప్పఁ దొడలఁ
దగవొప్ప నిడుకొని, ధారుణీవిభుఁడు
ఆకణ్వశిష్యుల కతిభక్తితోడఁ
బ్రాకటంబుగ నిచ్చి బహువస్తుతతులు,
మునినాథునకు లేఖ ముదమొప్పఁబెట్టి
యనిచిన, దీవించి యరిగి రమ్మునులు,
అంతట, దుష్యంతుఁ డఖిలరాజ్యంబు
వింతలాగున నేలి విఖ్యాతివడసి,
యాశకుంతలఁ గూడి యఖిలసౌఖ్యంబు
లాశయ్య బహుకాల మలర భోగించి,
క్రతువులు బహురీతిఁ గ్రమమొప్పఁజేసి,
చతురత యోగవిచారుఁడై, పిదపఁ
దనప్రధానులనెల్లఁ దాల్మి రావించి,
తనయుఁ బట్టముగట్టి తగ నొప్పగించి,
మునివృత్తి గైకొని ముదిమి నారాజు
ఘనతపంబునఁ బుణ్యగతులఁ బ్రాపించె.
ధరఁ గులకర్తయై తనరినయట్టి
భరతుండు ధర్మసుభరితుఁ డావెనుక
భూలోకమంతయు భుజశక్తి నేలి,
చాలవేడుకఁ జేసె జన్నముల్ పెక్కు.
సారత నతనిచేఁ జంద్రవంశంబు
భారతవంశమై పరఁగె నెంతయును.
జగతి దుష్యంతునిచరితంబు విన్నఁ,
దగవొప్పఁ జదివినఁ దనరుఁ బుణ్యములు.