పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

147


జపమాలికలు దెచ్చి సంయమీంద్రులకు
గృపనిచ్చు చెంచుల గీల్కొన్నదాని,
వాదించి చదివెడువటువుల వివిధ
వేదఘోషంబుల విలసిల్లుదాని,
మునుకొని వివిధంవుమ్రుగ్గులుగూర్చు
మునికుమారికలచే మొనసినదాని,
నేరుమద్దులమీఁద నెంచుచునున్న
నారపుట్టముల నున్నతమైనదాని,
భోగంబులన్నియుఁ బో విడనాడి
యోగమార్గంబెల్ల నొప్పుగా దెలిసి
యొదవ శిష్యులకు బ్రహ్మోపదేశంబు
తుదిచేయు మౌనులఁ దొడరినదానిఁ,
బుణ్యఫలముల కెల్లభూమియై మిగుల
గణ్యధర్మంబుల ఘనమైనదానిఁ
ఘనతపోధనుఁడైన కణ్వమునీంద్రు
ననఘాశ్రమస్థాన మధికమోదమునఁ
గనుఁగొని, యాశ్చర్యకలితుఁడై నృపతి
మునుకొని యచ్చోటిమునులకందఱకు
బ్రణమిల్లి, వారిచే బహుమానమంది,
[1] గుణవంతుఁ డందలి కొత్తలన్నియును
బరికించి చూచుచు, భక్తి దీపింప
సరవిఁ గణ్వునిపర్ణశాల కేతెంచి,
నెమలి[2]బర్హముకంటె నెఱిఁగల్మి గలిగి
యమరినకొప్పున నమరినదానిఁ,
బదియాఱుగాఁ జంద్రు భంగమొందించు
వదనపద్మమ్మున వలనొప్పుదాని,

  1. గుణవంతులందరి
  2. వర్ణము (మూ)