పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

133


బలుమాఱు పయ్యెద పాటించుకొనుచు
జిలిబిలిసిగ్గునఁ జెలువైనదాని
నమలాంగి శర్మిష్ఠ నారాజుచూచి
తెమలియుండఁగఁ, గాంచి తెఱవయుఁగదిసి
ప్రణమిల్లి పలికె : “నోపార్థివచంద్ర,
గణుతింప దై త్యేంద్రకన్యను నేను ;
వెసఁ గానలోఁగాయు వెన్నెలపోలెఁ,
బస దేఁటిగొననిపుష్పము తావివోలె,
నవనిఁదాఁచిన రత్నహారంబు పోలె,
ధవుఁబాయు కామినీతండంబు పోలె,
నాజవ్వనంబెల్ల నానాఁటికిట్టు
లోజ నూరకపోయె నోదయాధార !
ఋతుమతినై యేను నిట్లున్న దానఁ ;
జతురత నాకోర్కి సలుపు వే దేవ !”
అనుటయు, రాజన్యుఁ డబలకిట్లనియె:
"వినుము, నీమాటలు వినఁగూడవిపుడు ;
శుక్రుండు నిను మున్ను జూపి [1]చెప్పుచు, న-
వక్రముగ నాకునేవాక్యంబుచెప్పె
నావిధంబున నేను నరుగుదుఁ; గాని,
యే వెంట నామాట లేదాటవెఱతు."
అనవుడు శర్మిష్ఠ : "యట్లేల ! దీనఁ
దనరిన సత్యంబు దలఁగదు నీకుఁ ;
'బ్రాణసంకటముల, బ్రాహ్మణక్రియల,
రాణతోఁ బెండ్లిండ్ల, ద్రవ్యభంగముల,
నతివయు ఋతుమతియైయుండుచోట్లఁ
బతి కల్లలాడినఁ బాపంబులేదు',

  1. చెప్పుచును-నక్రంబుగా. (మూ)