పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

113


తెలిపి వారలరెండు తెగలగాఁగూర్చి,
కలహింపఁజేసెదఁ గళ్యాణి, వినుము.
అందు నిందునుగూడి యధికమానవులు
మ్రందుదు ; రంత నెమ్మదినుందుగాని ”.
అని భూమివీడ్కొల్పి, హరి యంత వెనుక
మనుజుఁడై, శ్రావణమాసకృష్ణమున
నష్టమి రోహిణి నర్ధరాత్రమున
దృష్టింప వసు దేవదేవకులందుఁ
బన్న గేంద్రుఁడు బలభద్రాఖ్యఁ దనకు
నన్నయై మునుబుట్ట, యదుకులాఁబుధిని
[1]కృష్ణ నారాయణ కేశవ జిష్ణు
విష్ణు నామసహస్ర విభవంబునందు
రామ రామాంతర రామావతార
సామర్థ్యరూపమై జనియించి మించె.
హరిజన్మ మదివిన్న నఖిలపుణ్యులును
హరిరూపులై యుందు రందును నిందు.

సురాసురులయంశమున భీష్మాదివీరులు జనించుట

హరి యిట్లు జనియింప, నసురులు సురలు
[2]హరివాక్యమున ధాత్రి నటపుట్టుచోట,
వసువులయంశముల్ వలనొప్పఁ దాల్చి
పొసఁగ భీష్ముఁడువుట్టెఁ బుణ్యమానసుఁడు ;
ద్రోణుండుపుట్టె శుక్రునియంశమునను ;
క్షోణిఁ గర్ణుఁడుపుట్టె సూర్యాంశమునను;
రూఢి నేకాదశరుద్రులంశమున
[3]గూఢముగ నుదయించె గుణమూర్తికృపుఁడు :
మహినిఁ గామ క్రోథ మద మత్సరముల
సహవాసలీల నశ్వత్థామపుట్టె;

  1. సహస్రనామకుఁడగు విష్ణునవతారములలో రామత్రయ సామర్థ్యము గలిగి కృష్ణుఁడు జన్మించెనని కవితాత్పర్యమేమో!
  2. హరిలోకమున.
  3. గూఢగా. (మూ)