పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము-ద్వితీయాశ్వాసము

89


మనవుండు నిట్లను: "నాత్మసంస్తుతియుఁ,
దనరంగ నితరనిందయును సత్పురుష
గుణములుగా; వైనఁ, గొనకోని నాదు
గుణములగల తెఱంగులు విన్నవింతు.
స్థావరజంగమతతులతో భూమి
లావునఁ దాల్తు ; నలంఘ్యపయోధి
వారిరత్నాలతో వరుసఁ జల్లుదును;
మీఱిన పక్షసమీరవేగమున
వరుస ముజ్జగములు వడిఁ జుట్టివత్తు;
నరయంగ మేరువునైన మత్పక్ష
హతి నుగ్గుసేయుదు." నన సంతసిల్లి :
'పతగాధిపతి, నాకు బద్ధసఖ్యుండ
వై యుండు ; మిగులనెయ్యంబార నిత్తు
నేయది నీకిష్ట మెఱిఁగింపు. ' మనినఁ:
"బాకశాసన, భవత్పాలితంబైన
లోకంబులందుఁ బెల్లుగ భుజంగములు
తిరుగుచు జీవులఁ దెగటార్చు; నట్టి
యురగు లాహారమైయుండు వరంబు

వినతాదాస్యవిమోచనము

నా కిమ్ము;" నావుడు నాకేశుఁ డొసగె.
ఆకశ్యపాత్మజుం, డమరనాయకుఁడు
విడువ కదృశ్యుఁడై వెంట నేతేరఁ,
దడయక కద్రువతనయులకడకు
బృందారకులకూటిబిందెను గొనుచు,
నెందును గదలక యేపుమై ధరకుఁ
జనుదెంచి, సుధకలశము దర్భమీఁద,
నునిచి యిట్లనియె నయ్యురగులతోడ :