పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

75


“కరుణావిధేయ, జగజ్జీవజనక,
కర మొప్ప మాతల్లిఁ గద్రువ తనకు
మరియాదమాలి, నెమ్మది దాసిఁ దేలి
పరికింప నన్నును బంటుగా నేలి
కొనియుండ, నయ్యురగులకు నమృతము
గొని తెచ్చియిచ్చి, మేకొనఁగ దాసీత్వ
ముడిపికోఁబూని పోవుచునుండి, జలధి
నడుమనున్నట్టి కాననచరావలుల
ఘనబుభుక్షార్తిఁ బెక్కండ్ర మ్రింగినను
దనివి లేకున్నది; తవిలి యాహార
మనఘాత్మ, దయచేసి యర్థి నన్ననుపు."
మనుడు నాకశ్యపుఁ డాత్మసంభవునిఁ
గనుఁగొని, యాతనికడఁకకు మెచ్చి:

సుప్రతీకవిభావసుల శాపవృత్తాంతము


"మును విభావసుఁడను మునివరుఁ డొక్కఁ
డపరిమితం బైన యర్థంబుఁ బడసి,
విపులలోభాత్ముఁడై, వీసంబు నందు
[1]వ్రయము గాకుండ నేర్పడఁ బాఁతి దాఁచి,
దయ లేక శిశువులు దగఁ గూటి కేడ్వ,
[2]నాయివారముల హీనాశ్రయవృత్తిఁ
బోయినంతనె పొద్దుపుచ్చుచు, దినము
లొకరీతి గడుపుచు నున్నచో; నంత,
నొకనాఁడు వానిసహోదరుండైన

  1. 'వ్యయమ'ని సవరింప వీలున్నను, తిక్కనప్రయోగము 'వ్రయమ'ని యుండుటచే నట్లే యుంచఁబడినది. చూ. తిక్కన, శాంతి ప. 4 ఆ. 345 ప.
  2. 'యాయావర' మను సంస్కృతపదమున కియ్యది వ్యావహారికరూపమై యుండును.