పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

ద్విపద భారతము


జనుదెంచి పొల్చినచందంబు దోప
వినువీధిఁ జుక్కలు వెలుఁగుచునుండె.
'వినత గన్గొనువేళ విబుధహయంబు
గనుపట్టియుండె నీక్రమమున' ననుచుఁ
బూర్వదిక్కాంత నేర్పున రచియించి
పర్విచూపిన మంచుపగిది, కళంకు
బెరసి చంద్రిక మింటఁ బేరి సొంపెక్కె.
విరహులహృదయంబు వేఁపెడిమంట,
యలచకోరంబుల యామనిపంట,
కొలఁది నొక్కటఁ గళల్ [1]గూర్చెడుదంట,
యీశుజూటంబుపై నేప్రొద్దు నుంట,
భాసిల్లు నలపంచబాణుని గంట
చంద్రుఁడు పొడిచె దిక్చక్రంబు వెలుఁగ
సాంద్రనిర్మలతరజలధి యుప్పొంగ.
యామినీకాంత సాయంకాలవేళ
గామించి పొంచినగాఢభూతంబు
విడుపింప వెన్నెలవీబూది మేనఁ
గడునొప్పఁగాఁ, గళంకపుఁదిలకంబు
నొనరంగఁ, బరివేషయోగపట్టెయును
మునుమిడి నక్షత్రములసంకుపూస
లగణితంబుగఁ దాల్చి, యఖిలలోకములఁ
బొగడొందుచును జగత్పూజ్యుఁడై కళల
వృద్ధి బొందిన మంత్రవేదియై, భూప్ర-
సిద్ధుఁడై దగు మంత్రసిద్ధుఁడో యనఁగ,
బలువిడి నధికసంభ్రమ మగ్గలింపఁ

గలువలవిందు శీఘ్రంబున నెక్కె.
  1. గూరెడుతంట (మూ)