పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

ద్విపద భారతము


పట్టి చంపఁగరాని పగఁ దెంపరాని
యట్టిచందంబున నతఁడు దుర్లభుఁడు.
విడువు శోకము; 'బండి విఱిగినవాఁడె
కడు వెఱ్ఱివా' డనఁగాఁ బోలదింక .
సొమ్ము పోనాడినచోటికె యరిగి
క్రమ్మఱ సాధించి కాంచినభంగి,
జడనిధిలో సమ స్తముఁ గూలెఁగాన
మడవక యవ్వార్థి మథియింపవలయు.
కవ్వంబు మంథనగంబుగా, దాని
కవ్వాసుకియె సూత్రమై యుండుటొప్పు.
నమరులు బలహీనులై యున్నవారు;
తమకంబుతో నబ్ధి దరువంగలేరు.
సరవితో నొకప్రయోజనమైనయపుడు
బిరుదేది పగఱతోఁ బ్రియమాడియైనఁ
జేకూరఁ గార్యంబు సిద్ధించినపుడు
పైకొని వైరంబు పాటించు టురవు;
కావున, నరిగి రాక్షసకోటితోడ
వేవేగ సంధిగావించుట యొప్పు.
వారు మీరును గూడ వారిధిమథన
మారూఢిఁ గొనసాఁగు; నగుఁ బనులెల్ల."
ననిపల్కి, యా దేవుఁ డప్పుడు ధిషణు
దనుజనాయకులయొద్దకుఁ బోవఁబనిచి,
గొనకొన్న వేడ్కతోఁ గొలువుచాలించి,
[1]..................................
సదమలాత్ముల మునీశ్వరుల నందఱను

ముదముతో నాశ్రమంబులకుఁ బోఁబనిచి,
  1. ఇట్టిచోట్ల ప్రాసాక్షరమునుబట్టి 'పాదములేవేని లుప్తములైయుండునేమో' యను సందేహమునకు వీలున్నను, పూర్వాపరార్థసందర్భములు సరిపోవుటచే, నొకప్రాసమును కవి మరిచెననుటకును అవకాశమున్నది.