పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

ద్విపద భారతము


పెదవులు తడుపుచుఁ బేర్చుదాహమునఁ
గదల లేనిది పోలెఁ గాంత కిట్లనియె:

సురకై సుదేష్ణ కీచకునింటికి ద్రౌపదిం బంచుట.

'వనిత నావదనంబు వఱువట్లు గొనియె;
మన సయ్యె నిపు డాన మదిరారసంబు.
వాచవి యగుకల్లు వాసించి యుండుఁ
గీచకునింట; తక్కినచోట లేదు.
కడువేగమునఁ బోయి కనకపాత్రమున
నిడికొని యది తెచ్చి యిమ్ము నా " కనిన
నదరి యానుడి చెవి కమ్ము గా సోఁక
హృదయంబు గలఁగఁ బెం పేది బె ట్టడలి
"ఏమి చేయుదు నెట్టు లిది తప్పుకొందు!
కాముబారికి లోఁగెఁ గంటకుం డతఁడు;
తనయింట ననుఁ జూడఁ దా నేల విడుచు?
కనికరం బతడేల కాంచు నా యెడను?
కుపిత హర్యక్షంబుగుహఁ జొచ్చుమృగము
నిపుణత సుసుఱుతో నేర్చునే మరల :
అందుఁ బో నొల్ల నం చాడంగ రాదు ;
మందతఁ బోరాదు; మఱి యేమీ చేయ?"