పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

79


పతి గన్న, దెగఁ జూచుఁ బ్రజ గన్న దూఱు
సతి గన్నఁ గోపించు సభ్యు లాడుదురు.
అవి యెన్న నేల ? నే నబలచే వింటి
నువిదకు గంధర్వు లున్నారు మగలు.
పులి యున్న పొదరిల్లు పూఁబోణి యనఁగ.
వలదు నీకాత్రోవ వలదు నాయన్న "
అనినఁ గీచక ముఖ్యుఁ డలుక దీపించి
తను దైవ మాడింపఁ దరుణి కిట్లనియె:
"వెలఁది. వెఱ్ఱివిగాక వెలఁదిమాటలకుఁ
దలఁకెడి వాఁడనే ! తప్పనాడితివి.
ఈ చరాచరమున నెట్టి సాహసులుఁ
గీచకుఁ డనిన శంకించి పాఱుదురు ,
కదన మబ్బదుగాక గంధర్వు లేల
త్రిదశవీరుల నైనఁ దివిరి సాధింతు.
ఇటు బుద్ధులను జెప్పు టెల్లబో విడిచి
కుటిలకుంతల నన్నుఁ గూర్చుమా కరుణ
నదిచేయఁ దగుకార్య మబల యియ్యెడను;
వదరకు నా మేలు వలసి తేనియును."
అనిలేచి రమణిపా దాబ్దపీఠమున
వినతుఁడై కీచకవిభుఁ డొప్పఁ బడెను