పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

ద్విపద భారతము


“ఎక్కడిమాట, నీ వెట్లు గొల్లఁడవు?
మిక్కిలి చెలువ మై మెఱసె నీమూర్తి :
సునిశితంబుగ సూర్యసోమవంశముల
జనియించినాఁడవు; సహజ మై యొకటఁ
గులము సత్కీర్తియు గుణముఁ దేజంబు
నల వొప్ప దాఁచిన నణగ దెవ్వరికి,
తగినసంపద లిత్తుఁ దగురీతి నుండు
జగతి నారాజ్యంబుఁ జక్క బెట్టుచును.
వచ్చిననీయంత వాని గోవులకుఁ
బుచ్చిన సపకీర్తి పుట్టదే నాకు? ,
అనవుడు సహదేవుఁ డామత్స్యపతికి
వినతుఁ డై మఱియును వేడ్క, ని ట్లనియె :
"అరయుట పని నాకు నధిప గోవులను ;
పరఁగఁ బాండుసుతులఁ బటుభక్తి గొలుతు;
ధరణి నిప్పుడు వారు దలఁ జూప కున్న
గురుతర స్థితి నిన్నుఁ గొలువ వచ్చితిని,
ప్రకటించి యేఁ జొచ్చి పొలించుదొట్టి
నొకట నక్షయముగా నొనగూడుఁ బసులు.
చెలు వొప్పఁ బోతు పంచితము మూర్కొన్న
కొలఁదిని చూ లౌను గొడ్డుటావులును.