పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


నెఱ పైనవిద్యను నేర్తు నే ననియుఁ
దెఱఁగు చెప్పితిఁ దేట తెల్లంబు గాఁగ.,
నేరనిపనులకు నే నెంతవాడ?
ఊరక మేకొన్న నొచ్చెంబు గాదె?
అశ్వవిద్యలు గాని యామీఁద నెవియు
శాశ్వతంబులు గావు జగదీశ మాకు.
కొలుతు, వేడుక యైనఁ గొలిపించుకొనుము ;
వలవ కుండినఁ జెప్పి వరుస న న్నంపు."
అనవుడు నరనాధుఁ డ ట్లేల? నీకు
నను వైనగతి నుండు మయ్య నాపద్ద.
మున్ను లాయములోన ముఖ్యు లై మెలఁగు
చున్న వారల నెల్ల నొప్ప మన్నించి
నామాఱుగా నీవు నయమున నుండు.
నీమాటలను మీఱ నిక్కంబు నేను. "
అని చెప్పి మాద్రేయు సర్థితో నిలిపె
జననాధుఁ డానంద సహితుఁ డై యపుడు.

సహదేవుఁడు గోపాలకుం డై విరటుచెంతకు వచ్చుట.

అత్తఱి సహదేవుఁ డాస్థానిఁ జేర
సొత్తెంచె నెంతయు సుభగవేషమున,