పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


అదియును గైసేసి యరుదెంచె నపుడు
పదనుపెట్టినపుష్పబాణంబుఁ బోలి,
ఘనలోకలోచనకైరవావళికి
నినిచిననిండు వెన్నెలసోగఁ బోలి,
కెరలినమత్త కోకిలచంచుధారఁ
జరుగక యున్న కెంజిగురాకుఁ బోలి.
కన్నులు గురులుఁ జొక్కట మైనపిఱుఁదుఁ
జెన్నార సరి లేనిచెలువంబు నొంది,
ప్రన్నని వయనుచే బటు వొప్పి చూడఁ
గన్నులపండు వై కల్యాణి యపుడు
తనవెంట నేతెంచు ధవళలోచనల
ననయంబుఁ బ్రీతిమై నం దంద పిలిచి
వచ్చి మ్రొక్కిన ముద్దు వచ్చి భూవిభుఁడు
గ్రుచ్చి కౌగిటఁ జేర్చి కూర్మి దైవార
మునివ్రేళ్లఁ జెక్కులు ముదముతోఁ బుణికి
తనమోముఁ గదియించి తనయమోమునను
నలినాక్షిమోముపై నలి రేఖ వ్రాసి
పలుమాఱుఁ గ్రొత్తగా భావించి చూచి
కువలయాధిపు డంతఁ గూతుఁ జూపించి
దివిజేంద్రసుతుతోడఁ దేటగా ననును: