పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

27


ప్రకటబాహాశక్తి పరఁగ నీవింట
నకులుండు సౌరాష్ట్రనాధు మర్దించె.
కాళింగ పాండ్యమాగధుల నీవింటఁ
జాల భీతిలునట్లు సహదేవుఁ డేసె.
ఇట్టి కైదువు లెల్ల నిదె నేఁడు మోఁపు
గట్టి మ్రాకున నౌర కట్టంగ వలసె !"

పాండవు లాయుధముల శమీవృక్షమున దాఁచుట.

అని యెక్కు డించుచు నన్ని కైదువులు
ఘనగదాఖడ్గచక్రములతోఁ గూడఁ
బెట్టెలోఁ బాములఁ బెట్టుచందమునఁ
బట్టి నెట్టనఁ గట్టి పైఁ దోలు బొదివి
యామీఁద వెండ్రుక లమరంగఁ జుట్టి
భూమీశుఁ డవి గొంచు భూజంబుఁ బ్రాఁకి
యప్పుడు ధీరుఁ డైయఖిల దేవతల
నొప్పుఁగాఁ బ్రార్థించి యోలి ని ట్లనియె :
"నేనును విజయుండు నే తెంచునపుడు
కాని మీరూపులు గాన రా నీక
వర్తింపుఁ డయ్య యెవ్వరు వచ్చి రేని ;
కీర్తింపు చున్నాఁడఁ గృతపుణ్యలార,