పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

357


విరటుఁడు కృష్ణాదులకు వస్త్రాభరణాదు లిచ్చి సత్కరించుట.

పెను పార నీరీతిఁ బెండ్లి చెల్లుటయు
ఘనుఁడు విరాటుఁ డగ్గలికతో నప్పుడు
పట్టుపచ్చడమును బంగారునగలుఁ
గట్టంగ మడుపులుఁ గంఠమాలికలుఁ
బొసఁగఁ బూబంతులుఁ బోక లాకులును
బసిఁడిపళ్లెరములఁ బచరించి తెచ్చి
పొనర నచ్యుతునకుఁ బూజించి యిచ్చి
వినతిఁ బాండవులకు వేర్వేఱ నిచ్చి
తెఱఁ గొప్ప నాద్రౌపదికి సుభద్రకును
నెఱయ భూషణవస్త్రనిచయంబు లిచ్చి
పదపడి పదివేలుభద్రనాగములు
చదు రొప్ప రథము లశ్వములు సద్భటులు
గణుతింప నైదులక్షలు పాడిపసులుఁ
బ్రణుతింప నరు దైనపసిఁడిటెక్కెములు
విభవంబు దైవార వేగఁ దెప్పించి
యభిమన్యునకుఁ గూర్మి నరణ మిప్పించి
యితర బాంధవులకు నింపు సొం పారఁ
బ్రతి లేనిభూషణాంబరము లిప్పించి