పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

356

ద్విపద భారతము.

అభిమన్యుఁ డప్పు డయ్యంగన కేలు
రభసవత్పులకాంగ రాగుఁ డై పట్టి
చెలువారుజిగి మించుచిగురాకుసురియ
వెలయఁ బట్టినతియ్యవిలుకాఁడు పోలె
వెలఁదిఁ దోడ్కొని హేమవేది డగ్గఱుచు
నలు వొప్ప నే కాసనంబున నొప్పె
నొగి రోహిణిని గూడి యుదయాద్రిమీఁద
మిగులఁ జూపట్టినమృగధరు పోలె.
ఆలోన యాజ్ఞికు లన్నంబు దర్భ
పాలాశసమిథలు బ్రహ్మసాశములు
వరశుభాక్షతలును బసిఁడిగిన్నియలు
సురభిగంధము నేయి స్రుక్స్రువంబులును
మొద లైనసద్ద్రవ్యములు గూర్చి క్రియలు
వదలక వానిచే వరుసఁ జేయింప
వారును సంతోషవనధి నోలాడి
కోరెక లారీతిఁ గొనసాగి వెలయఁ
దనువు లించుక సోఁకఁ దలచూపెఁ బులక
లొనరెఁ జేతులు దాఁక నొడ లెల్లఁ జెమట;
హోమకార్యము దీర్చి యుర్వీ దేవతలు
వేమాఱు నిచ్చుదీవెనలు గైకొనిరి.