పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

342

ద్విపదభారతము

"విను మేను నీతోడ వియ్య మందుటకుఁ
దనరి యోగ్యుఁడ నైతి ధన్యుండ నైతి.
హరికి మేనల్లుఁడు హరిపరాక్రముఁడు
మరునిఁ బోలినవాఁడు మాపుత్త్రి మగఁడు;
పరఁగఁ గులస్థానపౌరుషంబులకు
నిర వైనసుకుమారుఁ డీయింతిమగఁడు "
అని ఱేఁడు కొనియాడ నాధర్మసూనుఁ
డనయంబు వేడ్కతో నతని వీక్షించి
"పార్థుమాటల మాకుఁ బరితోష మయ్యె.
పార్థివ నీవింక బంధువర్గములఁ
బిలిపింపు ముత్తరపెండ్లి వేగంబె
యెలమిఁ జేయుద" మన్న నెసఁగుమోదమున
మిన్ను దాకుచు మత్స్యమేదినీశ్వరుఁడు
క్రన్నెనఁ దనపుత్త్రిఁ గౌంతేయులకును
మ్రొక్కించుటయు వారు ముదిత దీవించి
తక్కక యనిచి రంతఃపురంబునకు.
ఆవేళ విరటుఁ డత్యంతహర్షమున
దైవజ్ఞులను బిల్చి తాంబూల మిచ్చి
లలితవైవాహికలగ్న నిశ్చయము
తలకొని చేయించి తదనంతరమున