పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

333

"నితఁడు ధర్మజుఁ డైన నింక వాయుజుఁడు
హతవైరి క్రీడియు నామాద్రిసుతులు
నెచ్చట నున్న వా? రేది పాంచాలి ?
యచ్చుగా వివరింపు" మనిన నర్జునుఁడు
“వలలనామముఁ దాల్చి వంటకై నిన్నుఁ
గొలిచి కేసరిమల్ల కుంజరంబులను
బొనర మేడములోనఁ బోరాడి గెలిచెఁ
బెనుపొంద నతఁడె పో భీమసేనుండు.
మను జేంద్ర మఱియు దామగ్రంధి యనఁగ
నినుఁ గొల్చి వీయశ్వనికరంబు నరసి
ప్రకట బాహాశక్తిపరుఁ డైనవాఁడు
నకులుండు మాద్రిమన్ననఁ గన్న వాఁడు.
తెఱఁ గొప్ప మఱియుఁ దంత్రీపాలుఁ డనఁగ
మెఱసి నీగోవుల మేపఁ బుచ్చుచును
గొల్లవాఁ డై నిన్నుఁ గొలిచినాతండు
అల్లవో సహ దేవుఁ డని నిశ్చయింపు,
జననాధ వెండియు సైరంధ్రి యగుచు
నను వొంద మాలిని యనుపేరు దాల్చి
కేకయపుత్త్రి మిక్కిలి గారవింపఁ
బ్రాకటగతి నున్న భామ పాంచాలి.