పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


భూమీశుసొమ్ముఁ దెంపున నాసపడక
పామునెమ్ములు గాఁగ భావింప వలయు,
ఆవలింతయుఁ దుమ్ము హాస్యంబు సుమియు
వేవేగ విభునొద్ద వెలిఁ బుచ్చరాదు
వైరిదూతలతోడ వడి నల్పుతోడఁ
జేరి భాషించినఁ జెడు నెంత వాఁడు.
తొడరి భూపతియొద్దిదోమతో నైన
విడువనిపగ మోఁచి విహరింపరాదు.
కుడిచి కట్టితి నేమి కొఱఁత నాకనుచుఁ
బుడమిలో మెఱయుచుఁ బొంగంగ రాదు.
ఇది యంతఁ దలపోసి యీమత్స్యవిభునిఁ
గదిసి వర్తింపుడు కార్యసిద్ధికిని."
అని లోకహితముగా నప్పురోహితుఁడు
వినిపించుటయు నీతి విని పాండుసుతులు,
"అతికృతార్థుల మైతి మయ్య, మీవలనఁ
జతుర సేవాధర్మ చరితంబు దెలిసె.
తల్లిదండ్రుల రీతిఁ దగ బుద్ధి చెప్పి,
ఉల్లంబు చల్లఁగా నుపచరించితిరి.
పోయి వచ్చెద మింకఁ బోలు పైనలగ్న
మాయితంబుగఁ జేసి యనుపుఁ డీ" రనిన