పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


ఎఱుఁగువారికి నైన నిటుపెద్దవార
మెఱిఁగించుభంగిపై నిష్టంబు కలదు.
మనుజేంద్రుఁ గొల్చునమ్మనుజుండు దెలిసి
తనకుఁ బోలినచోటఁ దా నుండ వలయు.
విభునిముందరఁ బోక, వెనుకకు రాక,
సభలోన నిల్వఁ బార్శ్వంబుల నొప్ప
నిలుచుచు, విభునిపై నిజదృష్టి నిలిపి,
మెలపుమై బనులకు మేకొన వలయు.
నరపతి మన్నించు నా కేమి యనుచు
మరియాద మీఱుట మఱిఁ గార్యహాని.
విభునియేకాంతంబు వెలిఁ బుచ్చ రాదు;
విభునితో నొకమాట వివరింపరాదు;
అంతఃపురంబులో నతిమైత్రి తగదు;
కాంతలు సభ నెందుఁ గాన్పింపరాదు.
ఒప్పువాహనములు నుత్తమాశ్వములు
నెప్పుడు విభుఁ డీక యెక్కంగరాదు,
మన్నించుచో నుబ్బు మనుజేంద్రుకినుక
దన్నుఁ జెందినచోటఁ దగదు దైన్యంబు,
ఎం డైన వా నైన నెల్లను నోర్చి
మండలేశ్వరుపంపు మఱిఁ జేయ వలయు.