పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

ద్విపదభారతము

నడుములు ద్రుంచి యాననములు ద్రెంచి
నిడుపు వ్రయ్యలు బాఱ నెఱపి కొందఱను
బొట్టలు చించి వీపులు విదలించి
యట్టలు నేలతో నణఁచెఁ గొందఱను.
బెగ్గడించుచు నిట్లు బీభత్సుచేత
స్రగ్గుడుమ్రగ్గు డై సకల సైన్యములు
వెస వార్థిలో నోడ విరియుచందమునఁ
బొసఁగ నర్జునవార్థి బొంకక విరిసె.
విరిసినఁ గోపించి విజయు నీక్షించి
గురుతనూజాతుండు కొమ రొప్పఁ బలికె:
"ముదమున నావంక మొగముగా వెఱచి
కదన మెవ్వరితోడఁ గౌం తేయ నీకు ?
ఆచార్యు గెలిచినయాబీర మెల్లఁ
బాచి పుచ్చెద మంచి బంట వైరమ్ము.
గాండీవ ముండఁగాఁ గాదె గర్వించి
తొం డేల యింక నేయుదు గాక" యనుచు
జలజలఁ గ్రీడిపై శరవృష్టి, నెఱపి
నలు వొప్ప నొకకోల నారి ఖండించె;
అతఁడు వే ఱొకనారి యరయుసందునను
నుతశక్తి నందంద నొప్పించి యార్చె.