పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ - 5

277

తడిచేతఁ దుడిచి చిత్రము మాపినట్లు
తడయక సేన నంతయు రూపు మాపి
యంకితరత్నంబు లగుకిరీటములఁ
గంకణంబుల నొప్పుఘనబాహుతతులఁ
గలితకుండలము లౌకర్ణజాలములఁ
గలని శృంగారింపఁ గడఁకతో నచట
విపుల మై నిండి పర్వినరక్తవార్థి
కపుడు రత్నాకరం బనుపేరు చెల్లె,
అర్జునుం డపుడు సైన్యముఁ జంపి వైచి
దుర్జయుఁ డై పేర్చి ద్రోణుదేహమునఁ
బసిఁడిపింజలచేతఁ బరఁగుబాణములు
దశకోటిశతకోటి దాఁక నేయుటయు
నతఁడును దల యూఁచి యాశ్చర్య మంది
మతిలోన మెచ్చి సమ్మత మొప్పఁ బలికె:
"శూరుండ వగుదు వర్జున మేలు మేలు !
ధారుణి నెవ్వరితరము ని న్గెలువ ?
వృష్టిగాఁ దూపులు వెద చల్ల నేర్తు
వష్టావధానంబు హస్తలాఘవము !
మిగుల నేర్పున మమ్ము మించితి కాన
జగతిలో వింటి కాచార్యుండ వీవ.”