పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

ద్విపదభారతము

ఒక్క బాణముపోలె నొగి బాణపంక్తి
నెక్కొని గురుఁ డేయు నిమిషమాత్రమున;
నరుఁ డది తుమురుగా నఱకు చున్నాఁడు
ధరణి నే మని చెప్పుదము వీనినేర్చు !”
అనునంత గురుఁడు దివ్యాస్త్రంబు లింద్ర
తనయుపై నేయంగ ధరణి గ్రక్కదల
బుగులుకొంచును బేర్చుభూరి బాణాగ్ను
లెగయంగఁ జూచి యాయింద్రనందనుడు
వరుసతో నింద్రాగ్ని వరుణాదిసురల
వరముల గొన్న యుజ్జ్వల బాణతతుల
నతితీక్షములఁ గూర్చి పరఁగ నేయుటయు
నతుల మై బాణపక్షానిలం బపుడు
పడగలు చించి యంబర వీథి కెగయ
గొడుగులు గొనిపోయెఁ గురుసేనలోన.
తెగఁబడి ద్రోణుఁ డద్దివ్య బాణములఁ
బొగలఁ జిక్కినవహ్నిఁ బోలె ను క్కణఁచె
అప్పుడు కనలి ద్రోణాచార్యు సేన
కుప్పలుపడ నస్త్రకోటు లేయుచును
గాండివిఁ దాఁకిన గల్పాంతచండ
దండధరోద్దండతండ మై యతఁడు